హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్

హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్
  • హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్
  • ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 లేన్ రోడ్
  • రూ.541 కోట్లతో పనులు..8 చోట్ల ఫ్లై ఓవర్లు, 2 చోట్ల ఓపెనింగ్
  • వనస్థలిపురంలో ఎలివేటేడ్ హైవే నిర్మించాలని పబ్లిక్ డిమాండ్ 
  • కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఆర్ అండ్ బీ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్– విజయవాడ హైవేలో త్వరలో ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ హైవేను ఇప్పటికే 6 లేన్​రోడ్​గా నిర్మించాలని కేంద్రానికి నివేదించగా, ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  హైవే లో భాగంగా ఎల్బీ నగర్ నుంచి  దండు మల్కాపూర్ వరకు చేపట్టిన విస్తరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మొత్తం  రూ.541 కోట్ల  వ్యయంతో  25 కిలోమీటర్ల వరకు రోడ్ ను విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం 8 ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. వీటి దగ్గర ఇరువైపులా సర్వీస్ రోడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.  ఎల్బీనగర్‌నుంచి దండు మల్కాపూర్‌వరకు కొన్ని ప్రాంతాల్లో 6 లేన్ల రహదారి ఉండగా.. కొన్ని చోట్ల 4 లేన్​రోడ్డు ఉంది. ఇపుడు 25 కిలోమీటర్లు మొత్తం 6 లేన్ల రోడ్ త్వరలో పూర్తి కానున్నది.
  
2 ఫ్లై ఓవర్లు పూర్తి,  వచ్చే నెలలో మరో మూడు..

ఈ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు మధ్యలో మొత్తం 8 ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. వనస్థలిపురం, పనామ, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, కోహెడ జంక్షన్, కవాడిపల్లి జంక్షన్, అబ్దుల్లాపూర్ మెట్, ఇనాంగూడ, బాట సింగారంలో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో  రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ జిల్లా ఎంట్రీ అయ్యే దగ్గర, హయత్ నగర్ దాటిన తర్వాత ఫ్లై ఓవర్లు పూర్తి కాగా, వాటిపై నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తగ్గాయని వాహనదారులు చెబుతున్నారు. ఇక హయత్ నగర్ దగ్గర నిర్మిస్తున్న రెండు ఫ్లై ఓవర్లు చివరి దశకు చేరకున్నాయని, ఈనెలాఖరు లో ఓపెనింగ్ ఉంటుందని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. హయత్ నగర్ దగ్గర  రోడ్డుపై బస్టాండ్ ఉండడం, అన్ని బస్సులు బస్టాండ్ లోకి వెళ్లి, బయటకు రావటం, అక్కడే ఆటోలు, క్యాబ్ లు ఆగి ఉండడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ ఫ్లై ఓవర్లు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మిగతాచోట్ల కూడా వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక వనస్థలిపురంలోని పనామా నుంచి హయత్ నగర్ వరకు ఫ్లై ఓవర్లు లేని చోట ఉప్పల్ దగ్గర నిర్మిస్తున్న తరహాలో ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని  ప్రభుత్వాన్ని పబ్లిక్ కోరుతున్నారు. పైన, కింద వెహికిల్స్ వెళ్లేలా ఫ్లై ఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అయితే పబ్లిక్ డిమాండ్ ను కేంద్ర రవాణా శాఖ అధికారులకు పంపామని, ఢిల్లీ వెళ్లిన సమయంలో సీఎం రేవంత్, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి  వెంకట్​రెడ్డి 
ఈ అంశాన్ని నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారని ఆర్ అండ్ బీ కి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలో కేంద్రం ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

3 ఏండ్ల కింద సాంక్షన్.. కరోనాతో ఆలస్యం

ఎల్బీనగర్‌నుంచి దండు మల్కాపూర్‌వరకు రహదారిని విస్తరించాలన్న ప్రపోజల్ ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉంది. కాగా గత ప్రభుత్వంలో ఎంపీలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఈ ప్రాజెక్టును సాంక్షన్ చేయాలని పలుసార్లు లోక్ సభలో ప్రస్తావించడంతోపాటు కేంద్ర రవాణా శాఖ మంత్రిని నితిన్ గడ్కరీని కలిసి కోరారు. దీంతో 2021 లో ప్రాజెక్టు సాంక్షన్ అయింది. అయితే ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా రెండు దశలతో పనులకు బ్రేక్ పడిందని ఆర్ అండ్ బీ లో ఎన్ హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి  దండు మల్కాపూర్‌వరకు 8 లేన్లకు విస్తరించాలని అధికారులు తొలుత యోచించారు. ఆ తర్వాత 6 లేన్లకు ప్రతిపాదనలు రూపొందించారు. హైదరాబాద్‌–విజయవాడ మార్గం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని ఎన్ హెచ్ఏఐ ( నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ) పరిధిలో ఉంది. ఎల్బీనగర్‌నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు  ఆర్అండ్ బీ లోని ఎన్ హెచ్ఏఐ సెక్షన్ పరిధిలో ఉన్నది.  ఈ హైవే విస్తరించినప్పుడు 2010 లోనే  హైదరాబాద్‌–విజయవాడ మార్గా న్ని 8 లేన్లకు విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. అందుకు తగ్గట్టు నిర్మాణ సమయంలోనే భూసేకరణ చేశారు.  తాజాగా, రహదారి విస్తరణకు కొన్నిచోట్ల తప్ప పెద్దగా ఇబ్బందులు ఏర్పడలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 6 నెలల్లో ఇవి పూర్తవుతాయని అధికారులు అంటున్నారు.